సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కీలకం : కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 7 (విజయక్రాంతి): సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమల్లో పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కీలకమైందని, ప్రతి మండలం రెండు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రాధాన్య అంశాలుగా ఎంపిక చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. 202627 ఆర్థిక సంవత్సరానికి జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక , మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సమర్థవంతమైన సాధనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలో జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు . మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఎంపీడీవోలు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు.
పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల, ఆరోగ్యవంతమైన గ్రామాలు, బాలలకు అనుకూల వాతావరణం, నాణ్యమైన విద్య, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, పచ్చదనం, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా ప్రణాళిక అధికారి సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






