14 July, 2026 | 4:02 AM

ఎస్సీల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

14-07-2026 12:58 AM

కులవివక్ష నిర్మూలనకు యంగ్ ఇండియా పాఠశాలలే కీలకం

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, పరిపాలనా సహకారం అందేలా జాతీయ ఎస్సీ కమిషన్ చొరవ చూపాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సోమవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానాతో సమావేశమయ్యారు. 

రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను సీఎం కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కులవివక్షను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కీలకచర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రతి నియో జకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ ల్స్ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్స రం నుంచి వీటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

అలాగే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రవాణా సౌకర్యం వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.