16 May, 2026 | 9:03 AM

వారు దొంగ ఓట్లతోనే గెలిచారు

16-05-2026 12:38 AM
  1. 14 రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగింది
  2. బెంగాల్‌లో ఎన్నికలే నిదర్శనం
  3. తెలంగాణలో లౌకిక వాదుల ఓట్లు తొలగించే కుట్ర 
  4. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి  
  5. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. 14 రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని, అందుకు బెంగాల్ ఎన్నికలే నిదర్శమని తెలిపారు. బెంగాల్‌లో 90 లక్షల ఓట్లు తొలగించి, 60 లక్షలు కొత్తగా నమోదు చేశారన్నారు. 

రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేవని, ఏడాది పొడువునా ఎస్‌ఐఆర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డితో మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్‌నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియపై ఎస్‌ఈసీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు మూడుసార్లు వెరిఫికేషన్ చేయాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ మూడో దశ నిర్వహించాలన్నారు.

గత 24 ఏళ్లలో ఓటర్ల సంఖ్య 1.2 కోట్లు పెరిగినందున తొందరపాటు లేకుండా ఈ ప్రక్రియను ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు దశల వారిగా నిర్వహించాలన్నారు. జనాభా గణన, సర్ విధులు వేర్వేరుగా ఉండాలని, ఒకే అధికారికి రెండు బాధ్యతలు అప్పగించొద్దన్నారు. గుర్తింపు పొందిన పార్టీలకు 2002, 2025 నాటి ఓటర్ల జాబితాను అందించాలన్నారు. కొన్ని చోట్లా బయట దేశస్థుల నెపంతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని, పౌరుడి గుర్తింపు అడగకుండా నియమావళి చేయాలన్నారు. లౌకిక వాదాన్ని నమ్ముకున్న వారి ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని విమర్శించారు. 

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని, చివరకు సామాన్యుడు తీవ్రంగా నష్టపోతాడన్నారని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలకే పరిమితమైందని ఆయన  విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించా లని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న సమ యంలో దేశంలో పెట్రో ధరలను తగ్గించకుండా కేంద్రం ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు.