30 July, 2026 | 7:01 PM

కుక్కలు, కోతుల బెడద నివారణకు ప్రత్యేక కార్యాచరణ

30-07-2026 06:12 PM

రేపటి నుంచి ప్రత్యేక బృందాలతో నియంత్రణ చర్యలు

బాన్సువాడ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గత రెండు రోజులుగా వీధి కుక్కల దాడిలో  చిన్నారులు గాయపడటం అత్యంత బాధాకరమైన ఘటన అని మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ తెలిపారు. అదేవిధంగా పట్టణంలో కుక్కలతో పాటు కోతుల బెడద కూడా  ఉందని గుర్తు చేశారు. ఈ రెండు సమస్యల నివారణకు మున్సిపాలిటీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. శుక్రవారం నుంచి ప్రత్యేక బృందాలు బాన్సువాడ పట్టణంలో కుక్కలు, కోతులను పట్టుకునే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. వీధి కుక్కలను ప్రభుత్వ నిబంధనల మేరకు స్టెరిలైజేషన్ చికిత్స,యాంటీ రేబిస్ టీకాల కోసం తరలించడంతో పాటు, కోతుల నియంత్రణకు సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు.

ప్రజలు కొద్ది రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులను ఒంటరిగా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే ఇళ్ల పరిసరాల్లో ఆహార వ్యర్థాలు, తినుబండారాల అవశేషాలు బయట వేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. అదేవిధంగా ప్రజల భద్రత, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మున్సిపాలిటీ తనవంతు బాధ్యతగా పలు చర్యలు చేపడుతోందని అందులో భాగంగానే బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని ప్రత్యేక యంత్రాల సహాయంతో తొలగించి, వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ప్రాంతం, తాడ్కోల్ రోడ్ పరిసరాల్లో ఈ సమస్య అధికంగా ఉండేదని, పూడిక తొలగించిన అనంతరం మురుగు నీరు సజావుగా ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులు తగ్గాయని తెలిపారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రజల భద్రత, పరిశుభ్రత,ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కుక్కలు, కోతుల బెడదతో పాటు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కూడా మున్సిపాలిటీ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.