30 July, 2026 | 6:57 PM

ప్రజల కష్టాలకు చెక్... నిల్వ నీటిపై మున్సిపాలిటీ యుద్ధం

30-07-2026 06:05 PM

రామాయంపేట,(విజయ క్రాంతి): రామాయంపేట పట్టణంలోని 3వ వార్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు కష్టతరంగా మారడంతో పాటు దోమల వ్యాప్తి, అంటువ్యాధుల భయం నెలకొంది. సమస్య తీవ్రతను గుర్తించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు గూగులోత్ రవి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టారు.

సమస్యను ఆలస్యం చేయకుండా జేసీబీ యంత్రాలను రంగంలోకి దించి నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించే పనులను ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల భద్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. "ప్రజల సంక్షేమమే మా లక్ష్యం... ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదు" అని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు చింతల యాదగిరి, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.