25 February, 2026 | 6:55 AM

బఫర్ జోన్‌ను ఖాళీ చేయాల్సిందే!

25-02-2026 12:03 AM
  1. మూసీకి 50 మీటర్ల పరిధిలోని నిర్మాణాలన్నీ స్వాధీనం
  2. అనుమతులు ఉన్నా మధుపార్క్ రిడ్జ్  అపార్ట్‌మెంట్ కూల్చివేత తప్పదు
  3. రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మూసీ నది ప్రక్షాళనలో భాగంగా రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని మూసీ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టబోయే చర్యలపై రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు. మూసీ నది సరిహద్దుల నుంచి 50 మీటర్ల లోపల ఉన్న అన్ని నివాసాలు, ఇతర నిర్మాణాలను ప్రభుత్వం నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రాజెక్టు అవసరాల రీత్యా ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైందని తెలిపారు. కిస్మత్‌పురా, దర్గా ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లను జారీ చేసినట్లు వెల్లడించారు. బండ్లగూడ జాగీర్, ఉప్పర్‌పల్లి పరిధిలో మూసీకి ఆనుకుని ఉన్న నిర్మాణాలను కూడా త్వరలోనే స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. నది సరిహద్దు నుంచి 50 మీటర్ల పరిధిలో ఉన్న భవనాలు, ఇళ్లను తొలగించక తప్పదని స్పష్టం చేశారు.

మధుపార్క్ రిడ్జ్  అపార్ట్‌మెంట్ పూర్తిగా మూసీ బఫర్ జోన్‌లోనే ఉన్నదని ధ్రువీకరించారు. గతంలో అన్ని అనుమతులు పొంది దీనిని నిర్మించినప్పటికీ, ప్రస్తుత ప్రాజెక్టు నిబంధనల దృష్ట్యా, నది పునరుజ్జీవనం కోసం స్వాధీనం చేసుకోక తప్పదని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం బాధితులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతే అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంటామని, యజమానులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

60 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ

భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆర్‌డీవో తెలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 60 రోజుల్లోపు ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుని, పరిహారం చెల్లించి నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని వివరించారు.