చర్ల రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా
నాణ్యమైన విత్తనాలు, ఎరువులపై రైతులకు అవగాహన
చర్ల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "రైతు వేదికలలో విత్తన మేళా" కార్యక్రమంలో భాగంగా చర్ల మండల రైతు వేదికలో విత్తన మేళాను ఘనంగా నిర్వహించారు. ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న ఈ మేళాలో రైతులకు ఆర్ ఎన్ ఆర్ 15048, బిపిటి -5204 తదితర అధిక దిగుబడి వరి విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయ విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ లాంటి ఆధునిక ఎరువులు అందుబాటులో ఉంచారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతు వేదికల ద్వారా రైతులకు అన్ని సేవలు ఒకే చోట అందుతున్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ... ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని, మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమానికి , ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల బుచ్చిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందుల రమేష్ బాబు, ప్రముఖ రైతులు ఎడారి గణపతి, గొంది శేఖర్, సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అఫ్రీద్, తదితరులు హాజరై రైతులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో చర్ల మండలానికి చెందిన పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విత్తనాలు, ఎరువుల గురించి వివరాలు తెలుసుకున్నారు. సత్యం పెస్టిసైడ్స్ & సీడ్స్, కొత్తగూడెం వారు మేళాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.






