మహిళా రిజర్వేషన్లలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు
ఎన్నికల్లో లబ్ధ్దికోసమే మోదీ కుట్ర
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్‌కోటా ఇవ్వాల్సిందే
కాంగ్రెస్‌పై బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి
పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి బీజేపీ కుట్రలు చేసిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాల నుంచి సలహాలు తీసుకునే అనవాయితీని ప్రధాని నరేంద్రమోదీ విస్మరించడంలో అంతర్యమేమిటనీ నిలదీశారు. మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని వీహె డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా ఇవ్వకపోవడం వల్లే 131 రాజ్యాంగ సవరణ వీగిపోయిందన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్, పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్‌ఖాన్ తదితరులతో కలిసి మీడియా సమా వేశంలో మాట్లాడారు.
మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న దుష్పచారాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పికొట్టాలని ఆయన సూచించారు. మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా అడుగుతుంటే బ్లాక్ డే ఎలా అవుతుందని నిలదీశారు. ఓబీసీ ప్రధానిగా చెప్పుకునే నరేంద్రమోదీ బీసీలకు చేసిందేమి లేదన్నారు. ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలకు ఎంతో న్యాయం చేసిందని, భూ సంస్కరణలు అమలు చేసే పేదలకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.
జన గణనలో కుల గణన చేయాలని, మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ బీసీల పారీ ్టఅని చెప్పుకునే చంద్రబాబు కేంద్రం కుట్రలకు అండగా ఉండడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్రలో గుర్తించారని, అందుకే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ నిర్ణయం మేరకే తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కులగణన చేపట్టారని వీహెచ్ గుర్తు చేశారు.






