ప్రాంతీయ పార్టీలు ఫట్
పొత్తులతో కబళిస్తున్న బీజేపీ
ఓట్లను సైద్ధాంతికంగా మలుచుకోవడంలో విజయం
మిత్రపక్షాల ఓటు బ్యాంకు విలీనం చేసుకోవడంలో సఫలం
ఏపీ నేతలు ఈ సరళిని గమనిస్తున్నారా?
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): రాజకీయాల్లో పొత్తులు అనేవి తర చుగా అవసరార్థం చేసుకునే పెళ్లిళ్ల లాంటివి. కానీ వాటి పర్యవసానాలు మాత్రం అధికార సమీకరణాల్లో తీవ్రమైన విబేధాలను బహిర్గతం చేస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో జతకట్టిన ప్రాంతీయ పార్టీలు మెల్లమెల్లగా తమ స్వతంత్ర ఉనికిని కోల్పోతున్నాయి. అవి కేవలం జూనియర్ భాగస్వాములుగా లేదా తమ పాత వైభవానికి గుర్తులుగా మిగిలిపోతున్నాయి. మరోవంక దీనికి పూర్తి విరుద్ధ మైన పరిస్థితి కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రాంతీయ మిత్రపక్షాలతో పొత్తులకు దిగినప్పుడు.. ప్రాంతీయ పార్టీల ఆధి పత్యం ముందు కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోవడమో లేదా వారికి లొంగిపోవడమో జరుగుతోంది.
బీజేపీ తన సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించుకుంటూ ఓటు బ్యాంకును తనలో కలిపేసుకుంటుంటే, కాంగ్రెస్ తన స్థానాన్ని వదులుకుంటూ.. ద్వితీయ శ్రేణి పాత్రకు పరిమితమవుతోంది. అంటే.. బీజేపీ తనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను తినేస్తుంటే.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్‌ను తినేస్తున్నాయనేది ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా, చమత్కారంగా కనపడుతోంది.
బీజేపీకి ఉన్న కేంద్రీకృత జాతీ య ఆకర్షణ, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, హిందూ మెజారిటీ లేదా అంశాల ఆధారం గా ఓట్లను తమ సైద్ధాంతిక గొడుగు కిందకు తెచ్చుకునే సామర్థ్యం కారణంగా ఈ గతిశీలత పుట్టుకొచ్చింది. ప్రాంతీయ మిత్రపక్షా లు మొదట్లో కుల, వర్గ ఆధారిత ఓటు బ్యాం కుగా మద్ధత్తు ఇచ్చినప్పటికీ, కాలక్రమేణా బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో ఈ పార్టీలు పొత్తు ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు నేరుగా బీజేపీతోనే పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. 2014 నుంచి జాతీయస్థాయిలో బలహీనపడిన కాంగ్రెస్, డీఎం కే, టీఎంసీ లేదా ఎన్సీపీ వంటి దూకుడు ప్రదర్శించే ప్రాంతీయ పార్టీలకు మద్దతుదారుగా మారి, సీట్ల కేటాయింపులోనూ వారి ఆధిపత్యానికి తలొగ్గాల్సివస్తోంది.
పంజాబ్: శిరోమణి అకాలీదళ్ పతనం..
బీజేపీకి దగ్గరవ్వడం వల్ల కలిగే నష్టానికి శిరోమణి అకాలీదళ్ ఒక ఉదాహరణ. సుదీర్ఘకాలం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఈ పార్టీ, 2020లో సాగుచట్టాల విషయంలో విడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను కేవలం ఒకే ఒక్క సీటు (హర్‌సిమ్రత్‌కౌర్ సాధించింది.
ఈ పార్టీ ఓటు శాతం 2019లో 27.45 శాతం నుంచి 13.42 శాతానికి పడిపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేవలం 3 సీట్లతో (18.38 శాతం ఓట్లు) సరిపెట్టుకుంది. కాంగ్రెస్, ఆప్, బీజేపీ (ఓటు శాతం పెంచుకుంది)ల మధ్య నలిగిపోతూ, ఒకప్పుడు సిక్కుల ప్రధాన గొంతుకగా ఉన్న అకాలీదళ్ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో, కీలకమైన ‘పాంథిక్’ మద్దతును కోల్పోయి కొట్టుమిట్టాడుతోంది.
బీహార్: జేడీయూ, ఎల్జేపీ ఆధిపత్యం కంటే ఆధారపడటమే ఎక్కువ..
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 243 స్థానాలకు గాను 200పైగా సీట్లతో భారీ విజయం సాధించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 84- సీట్లు గెలుచుకుని మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీష్ కొన్నాళ్లు సీఎంగా ఉన్నా, తర్వాత బీజేపీ నాయకుడు ఆ పదవిని చేపట్టారు.
ఆర్జేడీ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ నేపథ్యంలో జేడీయూ ఉనికికి ఇప్పుడు ఎన్డీయే గొడుగు ఆధారంగా మారింది. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్) 19 సీట్లు గెలిచి బలాన్ని చాటుకున్నా, బీజేపీ విస్తరణ ప్రభావ నీడలోనే ఇలాంటి చిన్న పార్టీలు మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఉంది.
మహారాష్ట్ర: శివసేన చీలిక.. యూబీటీ పోరాటం..
2022లో శివసేనలో వచ్చిన చీలిక ఈ ప్రమాద సంకేతాలను స్పష్టం చేసింది. ఉద్ధవ్ థాకరే వర్గం (శివసేన బీజేపీని వ్యతిరేకిస్తూ మహావికాస్ అఘాడి (ఎంవీఏ)లో చేరింది. 2024 నవంబర్ ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం కేవలం 20 సీట్లకు (9.96 శాతం ఓట్లు) పరిమితమైతే, బీజేపీ మద్దతు ఉన్న ఏకనాథ్ షిండే వర్గం ‘మహాయుతి’ కూటమిలో భాగంగా 57 సీట్లు సాధించింది. బీజేపీ ఒంటరిగానే 132 సీట్లు గెలుచుకుంది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్ధవ్ థాకరే వర్గం పట్టు నిలుపుకున్నా, అసలైన శివసేన గుర్తింపును, మరాఠీ ఆత్మగౌరవ నినాదాన్ని అధికార పక్షానికే జారవిడవాల్సి వచ్చింది.
హర్యానా: జేజేపీ క్లీన్ స్వీప్..
2019 తర్వాత బీజేపీతో జతకట్టిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా తుడిచిపెట్టుకుపోయింది. దుష్యంత్ చౌతాలా వంటి అగ్రనేతలు డిపాజిట్లు కోల్పోగా, పార్టీ ఓటు శాతం 14.8 శాతం నుంచి ఒకశాతం కంటే తక్కువకు పడిపోయింది. బీజేపీ, కాంగ్రెస్‌లు జాట్ ఓట్లను పంచుకోవడంతో చిన్న పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయి.
ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలు: బీఎస్పీ, ఆర్‌ఎల్డీ, పీడీపీ, జేడీఎస్..
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ 2024 ఎన్నికల్లో లోక్‌సభలో ఖాతా తెరవలేకపోయింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఈ పార్టీ, ఇప్పు డు బీజేపీ, ఎస్పీల మధ్య నలిగిపోయి తన దళిత ఓటు బ్యాంకును కూడా కాపాడుకోలేకపోతోంది.
జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకున్న పీడీపీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకు పరిమితమైంది. కర్ణాటకలో జేడీఎస్ కూడా తన పట్టున్న వొక్కలిగ ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల చేతిలో దెబ్బతింటోంది.
కాంగ్రెస్‌తో పొత్తు.. విరుద్ధమైన పరిస్థితి..
బీజేపీ తన సంక్షేమ పథకాలు, హిందుత్వ నినాదం, సంస్థాగత బలంతో మిత్రపక్షాల ఓటు బ్యాంకును తనలోకి విలీనం చేసుకుంటుంటే (తినివేస్తుంటే).. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న మిత్రపక్షాలు (ప్రాంతీయ పార్టీ లు) మాత్రం కాంగ్రెస్‌ను బలహీనం చేస్తూ.. తాము బలపడటం గమనార్హం. అంటే ప్రాం తీయ పార్టీలతో పొత్తుపెట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీ బలహీనం అవుతోంది. తమిళనాడులో డీఎంకే ఆధిపత్యం ముందు కాంగ్రెస్ ఒక చిన్న పాత్రకే పరిమితమైంది.
పశ్చిమ బెంగాల్లో టీఎంసీదే పైచేయి. మహారాష్ట్ర ఎంవీఏలోనూ శివసేన, ఎన్సీపీల కంటే కాంగ్రెస్ వెనుకబడింది. ఇది కాంగ్రెస్ సంస్థాగత బలహీనతను సూచిస్తోంది. అదే సమ యంలో కుల, భాషా ప్రాతిపదికన బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నుంచి తమకు కావాల్సినది రాబట్టుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు దీనిని గమనిస్తున్నారని ఆశిద్దాం..!






