బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్
సదాశివనగర్,(విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం అందించి ప్రతి ఫిర్యాదుకు న్యాయం చేకూరే విదంగా కేసులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ పలు సూచనలు చేశారు. పిటిషన్లు సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించాలని, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, రైటర్ రూమ్, వివిధ రికార్డులు, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణ, ఇతర విభాగాలను పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు.
అనంతరం స్టేషన్ పరిసరాలను సందర్శించి పరిశుభ్రత, నిర్వహణపై పలు సూచనలు చేశారు.పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్ సిబ్బందిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి విధుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేస్తుందని తెలిపారు. ప్రతి పోలీసు ఉద్యోగి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో సమయం గడపాలని, పిల్లల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలని సూచించారు.
జూదం, ఆన్‌లైన్ గేమింగ్ వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వ్యక్తిగత క్రమశిక్షణే వృత్తిపరమైన నిబద్ధతకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే ప్రతి కేసు, ప్రతి పిటిషన్‌ను తప్పనిసరిగా సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఆదేశించారు. అలాగే జిల్లా కార్యాలయం నుంచి జారీ అయ్యే సూచనలు రోల్‌కాల్‌లో సిబ్బందికి సక్రమంగా తెలియజేస్తున్నారా అనే అంశాన్ని స్వయంగా పోలీసు సిబ్బందిని ప్రశ్నించి తెలుసుకొని వారితో విస్తృతంగా చర్చించారు.
పోలీసు ఉద్యోగం కేవలం విధి మాత్రమే కాకుండా ప్రజాసేవ అనే భావనతో ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించిన జిల్లా ఎస్పీ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వి.పి.ఓలు తమ గ్రామాలను తరచూ సందర్శించి స్థానిక పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని, కీలక సమాచారం లభించిన వెంటనే సంబంధిత అధికారులకు చేరవేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పిటిషన్‌ను నమోదు చేసి నిష్పాక్షికంగా విచారణ నిర్వహించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలు, జీవన విధానం, కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి నేర నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చేలా సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. సంతోష్ కుమార్, సదాశివనగర్ ఎస్‌ఐ శ్రీ ఎం. పుష్పరాజ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






