నేడు గూడెంకు ఉప ముఖ్యమంత్రి రాక
ఏర్పాట్లను పరిశీలించిన ఎం ఎల్ ఏ, కలెక్టర్, డి సి పి
దండేపల్లి, జూన్ 12 : మంచిర్యాల జిల్లాలో ఈ నెల 13న రాష్ట్ర ఉపమఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను శుక్ర వారం ఎం ఎల్ ఏ ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, డి సీ పీ ఎగ్గడి భాస్కర్ లు పర్యవేక్షించారు.
జిల్లాలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయాన్ని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డి.సి.పి. ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, గిరిజన సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్, ఆలయ ఈ.ఓ. శ్రీనివాస్ లతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ నెల 13వ తేదీన ఉదయం జిల్లాలోని దండేపల్లి మండలం శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం పునర్నిర్మాణం, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో సింగరేణిలో వైద్య పరంగా విధులు నిర్వహించలేని ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందజేస్తారని, సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియాలో ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలిస్తారని, అనంతరం మంచిర్యాల పట్టణంలో శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
మంచిర్యాల పట్టణంలోని వేంపల్లి ప్రాంతంలో గల పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాట్లను మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, డి సీ పీ భాస్కర్, ఎ.సి.పి. ప్రకాష్ లతో కలిసి పరిశీలించారు. తదనంతరం మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్ ను సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ తో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.






