29 July, 2026 | 10:38 PM

భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర

29-07-2026 09:48 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న గిరిజనులు

భద్రాచలం,(విజయక్రాంతి): ఆషాడ పౌర్ణమిని సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో పోకల దమ్మక్క సేవా యాత్రను బుధవారం ఘనంగా నిర్వహించారు.. దమ్మక్క సేవలను కొనియాడుతూ దమ్మక్క వారసులైన గిరిజనుల సమక్షంలో నిర్వహించిన శోభాయాత్రలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఆలయ ఈవో,అర్చకులు పండితులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రధాన ఆలయంలో మూలవరుల వద్ద ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఆలయ ప్రాంగణంలోని పొగడ చెట్టు కింద ఉన్న దమ్మక్క విగ్రహం వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వేడుక సందర్భంగా సీతారామ చంద్రులకు అలంకరించిన స్వర్ణకవజాలతో బంగారు వర్ణంలో మెరిసిపోయారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున  దమ్మక్క సేవలను స్మరించుకుంటూ వివిధ ఆదిమ తెగలకు చెందిన గిరిజనుల సమక్షంలో దమ్మక్క సేవా యాత్రను ప్రతి ఏటా ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుండి హాజరైన గిరిజనులు అడవి నుండి సేకరించి తెచ్చిన అటవీ ఫలాలను పుష్పాలను సీతారాములకు సమర్పించారు.

గిరిజనుల సంప్రదాయ నృత్యాలైన డోలు బాజాలతో,కొమ్ము నృత్యాల నడుమ శ్రీరామరథంతో పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు..పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న దమ్మక్క విగ్రహానికి అర్చకులు నూతన వస్త్రాలు అలంకరించి,పూలమాలలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రగా ఆలయానికి చేరుకొని సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్న గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అపర శబరిగా కొనియాడుతున్న భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి అపరభక్తురాలు పోకల దమ్మక్క భద్రాద్రిలో లక్ష్మణ సమేత సీతారామచంద్రుల విగ్రహాల మూలవరులను ఓ పుట్టలో గుర్తించి రామదాసుకు తెలియజేసి అనంతరం స్వామివారి ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న గిరిజన భక్తురాలు దమ్మక్క సేవలను కొనియాడుతూ దమ్మక్క సేవా యాత్రను గిరిజన భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఆమెను కొలవడం ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది..చరిత్రలో నిలిచిపోయిన ఆమె సేవలను స్మరించుకుంటూ గిరిజన ఆచార,సంప్రదాయాల ప్రకారం భద్రాద్రి దివ్య క్షేత్రంలో గత కొద్ది ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తు వస్తున్నారు...