29 July, 2026 | 10:45 PM

ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు

29-07-2026 09:51 PM

మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజలెవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ 'ఎస్ఐఆర్' (SIR) దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ సూచించారు. మంగళవారం పట్టణంలోని పోలింగ్ స్టేషన్ 216 లో 'ఎస్ఐఆర్' దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, స్థానిక నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో దరఖాస్తు చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఆగస్టు 3 తేదీ లోపు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి, సంబంధిత బిఎల్ఓ లకు త్వరితగతిన అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ కర్నె లక్ష్మీ, జూనియర్ అసిస్టెంట్ అభిషేక్, బీఆర్‌ఎస్ నాయకులు జయరాజు తదితరులు పాల్గొన్నారు.