calender_icon.png 18 February, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఆవిడతో సహా అందరూ చెప్పిందదే!

18-02-2026 12:00:00 AM

సుహాస్, శివానీ నాగారం జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘హే బలవంత్’. ఇందులో సీనియర్ నటుడు నరేశ్, యాంకర్ స్రవంతి ముఖ్యపాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బీ నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఫిబ్రవరి 20న రిలీజ్ కానున్న ఈ నేపథ్యంలో హీరో సుహాస్ మంగళవారం పాత్రికేయులతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. “భగవాన్ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్ మార్చాలని సెన్సార్ వారు సూచించడంతో ‘హే బల్‌వంత్’గా మార్చాం.

సినిమాలో నరేశ్ క్యారెక్టర్ పేరు మార్చాం. టైటిల్‌తోపాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సార్ వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే.. చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఆలోచించే కుర్రాడి పాత్ర నాది. నాన్న బిజినెస్‌ను టేకప్ చేయాలని అనుకుంటాడతను. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలేంటి? నాన్న బిజినెస్ ఏమిటి? ఇలా సినిమా, నా పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉంటాయి. కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా వినోదంతోపాటు ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యాను. ప్రతి సినిమా విజయం కోసం ఎదురుచూడటమే నా పని. కాకపోతే కొంత బాధగా అనిపిస్తుంది.

కానీ, వెంటనే తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నా. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి చేయమని అన్నారు. ఇంట్లో మా శ్రీమతి కూడా! అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్ ఇచ్చి ‘హే బల్‌వంత్’ చేశా. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. నా కెరీర్ ప్రారంభంలో షార్ట్‌ఫిల్మ్స్‌లో కామెడీ పాత్రలే చేశా. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది.

తమిళ్ సినిమా ‘మందాడి’లో నాది మెయిన్ విలన్ క్యారెక్టర్. సినిమా రిజల్ట్ తర్వాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇక నా నుంచి వచ్చే సినిమాలంటే.. కార్తీక్ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నా. త్వరలోనే ఫైలన్ అవుతాయి” అని చెప్పారు.