calender_icon.png 18 February, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎస్ సుబ్బులక్ష్మిబయోపిక్‌లో..!

18-02-2026 12:00:00 AM

అమరన్, తండేల్ వంటి రెండు వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు మరింత ఆసక్తికరమైన, విభిన్న చిత్రాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామయణ’లో సాయిపల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. భారతీయ సంస్కృతిలో అమూల్యమైన ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.

తొలిభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ ఏడాది దీపావళికి విడుదల కానుందీ చిత్రం. రెండోభాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతోపాటు ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి ‘ఏక్ దిన్’లో నటిస్తోంది సాయిపల్లవి. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమాలోనూ సాయిపల్లవి ఇటీవలే భాగమైంది. ఇదిలావుండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందీ బ్యూటీ.

ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి నటించబోతోంది. ఈ ప్రాజెక్టు దర్శకత్వ బాధ్యతలను గౌతమ్ తిన్ననూరి నిర్వర్తిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు ప్రారంభించేశారట మేకర్స్. అయితే, ఈ బయోపిక్‌ను ప్రముఖ కెమెరామెన్ రాజీవ్ మీనన్ 2013లో తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు.

ఎంఎస్ సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్‌ను తీసుకోవాలని అనుకోవడం, స్టోరీ వినిపించడం, ఆమె కూడా ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. కానీ, ఎందుకో కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఈ బయోపిక్‌లో లీడ్ రోల్ పోషించేవారిలో నయనతార, రష్మిక మందన్న, త్రిష కృష్ణన్ పేర్లు వినిపించాయి.  తాజాగా ఈ ప్రాజెక్టును టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ చేపట్టి, టైటిల్ రోల్ కోసం సాయిపల్లవిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.