30 May, 2026 | 3:19 PM

కాళేశ్వరం ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా తాటిపెల్లి రాజన్న ప్రమాణ స్వీకారం

30-05-2026 02:24 PM

ముత్తారం, మే 30 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా  ముత్తారం మండల కేంద్రానికి చెందిన తాటిపెల్లి రాజన్న  శనివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ చైర్మన్ అవదానుల మోహన్ శర్మ ఈఓ తో పాటు పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అధికారులు ఆయన చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాజన్న  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయనను స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ముత్తారం మండల ప్రజా ప్రతినిధులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తాటిపెల్లి రాజన్న  మాట్లాడుతూ.. దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా సేవ చేసే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు కు మంథని నియోజకవర్గ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతుల కల్పనకు, అలాగే దేవాలయ సమగ్ర అభివృద్ధికి పాలకమండలి సభ్యులతో కలిసి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ తో పాటు డైరెక్టర్లు,  ప్రముఖులు, ఆలయ అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.