25 July, 2026 | 10:13 AM

అస్సాంలో భారీ వరదలు... 61కి చేరిన మృతుల సంఖ్య

25-07-2026 09:33 AM

గువహతి:  భారత ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఈ నెల ప్రారంభంలో మొదలైన వరదల(Assam Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) తెలిపిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో మరో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో, రాష్ట్రంలో కొనసాగుతున్న వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 61కి చేరింది. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగానే కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ASDMA తాజా నివేదిక ప్రకారం, ఇటీవల సంభవించిన 14 మరణాలలో ఏడు చరైడియో జిల్లాలో, ఆరు శివసాగర్ జిల్లాలో, ఒకటి జోర్హాట్ జిల్లాలో నమోదయ్యాయి. మరణించిన వారిలో 11 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

అలాగే, శివసాగర్ జిల్లాలో ఒక వ్యక్తి గల్లంతయ్యారు. గోలాఘాట్, చరైడియో, దిబ్రుగఢ్, హోజాయ్, నాగావ్, బిశ్వనాథ్, జోర్హాట్, ధేమాజీ, శివసాగర్, సోనిత్‌పూర్, కామరూప్ (మెట్రో), కర్బీ ఆంగ్లాంగ్ అనే 12 జిల్లాల్లో 7.05 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితం కావడంతో, రాష్ట్రంలో పరిస్థితి మొత్తం మీద ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం శివసాగర్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది (3,48,555 మంది బాధితులు). ఆ తర్వాతి స్థానాల్లో చరైడియో (1,88,404 మంది),  జోర్హాట్ (1,26,793 మంది) ఉన్నాయి. వరదల వల్ల 856 గ్రామాలు , 37 రెవెన్యూ సర్కిళ్లు ప్రభావితమయ్యాయని ASDMA నివేదిక మరింతగా పేర్కొంది. వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. 56,606.777 హెక్టార్ల పంట విస్తీర్ణం వరద నీటిలో మునిగిపోయిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నీటి మట్టాలు తగ్గకపోవడంతో, వరద ప్రభావిత జిల్లాల్లో యంత్రాంగం ఏర్పాటు చేసిన 363 సహాయక శిబిరాలు, పంపిణీ కేంద్రాలలో 3.15 లక్షల మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందినట్లు అధికారులు ప్రకటించారు.