30 May, 2026 | 3:24 PM

సీనియర్ అసిస్టెంట్ అన్నారావుకు పదవి విరమణ వీడ్కోలు

30-05-2026 03:01 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సీనియర్ అసిస్టెంట్ అన్నారావు పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారావును శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఆయన సేవలను కొనియాడారు. కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన అన్నారావు 2003లో స్వీపర్‌గా పోలీసు శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి, క్రమంగా పదోన్నతులు పొందుతూ సీనియర్ అసిస్టెంట్ హోదాకు చేరుకున్నారు.

సుదీర్ఘకాలం శాఖకు విశిష్ట సేవలు అందించిన ఆయన పదవీ విరమణ సందర్భంగా సహోద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ అన్నారావు తన విధుల్లో అంకితభావంతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన క్రమశిక్షణ, నిబద్ధత ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, ఏవో భక్త ప్రహ్లాద్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.