27 June, 2026 | 1:32 AM

వారణాసి షూటింగ్ ముగిసేది అప్పుడే

27-06-2026 12:00 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వారణాసి’. ఈ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇదిలావుంటే, ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ బిగ్ అప్డేట్‌ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన.. “వారణాసి’ సినిమా షూటింగ్ మరో నాలుగు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా పూర్తవుతుంది.

సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ, వారణాసిలోని ముఖ్యమైన భాగాల షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం కేవలం కథను అనుసంధానం చేసే చిన్న చిన్న సన్నివేశాలనే తెరకెక్కిస్తున్నాం. ఈ కథ ఐమాక్స్ స్క్రీన్‌పై చూస్తేనే అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని మేము ముందుగానే భావించాం.

అయితే ఈ ఫార్మాట్ కోసం కథలో ఎలాంటి ప్రధాన మార్పులు చేయలేదు. సాంకేతిక పరమైన సర్దుబాట్లు మాత్రమే చేశాం. ‘అనోమార్ఫిక్ ఫ్రేమింగ్’ పద్ధతిని ఉపయోగించి దృశ్యాలను చిత్రీకరించాం. దీనికోసం మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత సునాయసంగా సాగింది” అని తెలియజేశారు. రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ సినిమాపై హైప్ పెరిగింది.