మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ,
దుండగులు పరారీ.
ఆలేరు, జూన్ 18 (విజయక్రాంతి): ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో దొంగతనం కలకలం రేపింది. గ్రామానికి చెందిన అంబాల జయమ్మ ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమె మెడలోని పుస్తెలతాడును అపహరించి పరారయ్యాడు. గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో అంబాల జయమ్మ మంచినీళ్ల కోసం ఇంటి వెనుక ఉన్న వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లింది. ఇంటి వెనుక భాగంలో గోడ లేకపోవడంతో దొంగ అదే అదనుగా భావించి ఇంట్లోకి ప్రవేశించి, ఇంటి వెనుక ఉన్న బల్బును తొలగించి, నీళ్లు పడుతున్న జయమ్మ మెడలోని పుస్తెలతాడును ఒక్కసారిగా లాక్కున్నాడు.
హఠాత్పరిణామానికి భయపడిన జయమ్మ "దొంగ.. దొంగ.." అంటూ పెద్దగా కేకలు వేయడంతో దుండగుడు బైక్‌పై మాటూర్ వైపు పారిపోయినట్లు బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న ఆలేరు సీఐ యాలాద్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, గ్రామంలో నిఘా పెంచామని సీఐ యాలాద్రి వెల్లడించారు. ఇంటి వెనుక గోడ లేకపోవడం, తెల్లవారుజామున ఒంటరిగా వెళ్లడమే దొంగకు కలిసి వచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.






