20 June, 2026 | 5:15 AM

పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ వెంటనే అందించాలి

20-06-2026 12:32 AM

హనుమకొండ, జూన్ 19 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు యూనిఫారమ్స్, స్కూల్ బ్యాగ్స్ అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం  హనుమకొండ లోని గుండ్ల సింగారం ప్రభుత్వ పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 5 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించలేదన్నారు. ప్రభుత్వ విద్య రంగ సమస్యలను పరిష్కరించడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్య  సంస్థలు ప్రారంభం కాక ముందే తెలంగాణ రాష్ట్రంలో, హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు యూనిఫారమ్స్ అమ్ముతున్నా కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ  జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి సాయి కుమార్,అనుఫ్, అభిషేక్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.