11 March, 2026 | 1:06 AM

చదువే మనిషికి కావాలి జీవం...

10-03-2026 07:47 PM

- పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలి

- రాష్ట్రపతి, అంతర్జాతీయ అవార్డు గ్రహీత యోగేశ్వర్

జైపూర్,(విజయక్రాంతి): చదువే మనిషికి జీవం కావాలని, విద్యను ఇష్టపడుతూ చదవాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రేరణాత్మక వక్త, రాష్ట్రపతి అంతర్జాతీయ అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల పిఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం "చదువు.. బడి.. తల్లిదండ్రులు.. పరీక్షలు" అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

బడి కోసం మనం.. మన కోసం బడి లక్ష్యంగా తల్లిదండ్రులు సహకారం అందించాలని  కోరారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున నేపథ్యంలో  ఉత్తమ ప్రతిభ చాటడానికి ఎలా చదవాలో, జ్ఞాపకం చిట్కాలు చెప్పారు. ఒత్తిడిని జయించి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలనీ సూచించారు.  అనంతరం ప్రభుత్వం చేపడుతున్న పరిశుభ్రత వారోత్సవాల సందర్భంగా తడి పొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రయోగాత్మకంగా విద్యారులను భాగస్వామ్యం  చేసి చూపించారు.

కృత్యాధార ఆటపాటల కార్యక్రమాల ద్వారా విద్యార్థులతో ఉపాధ్యాయులతో మమేకమై సందడి చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి మొక్కలు నాటారు. బాలల గేయాలు చదివి పిల్లలతో కలిసి చదివించారు. పర్యావరణ రక్షణకై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రకృతిమిత్ర ఉత్పత్తుల స్టాల్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు.

నీటి వనరులు, జీవవైవిద్య సంరక్షణ, కాలుష్య రహితం కోసం, సింగల్ యూస్ ప్లాస్టిక్ మానేసి బట్ట సంచులు ఉపయోగించాలనీ సూచించి బట్ట సంచులు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్. జ్యోతి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ కే స్రవంతి, ఐటీ నిపుణులు ఎం శరత్ చంద్, ఉపాధ్యాయులు పి.వేణుమాధవ్, ఎస్కె షహీనా, ఎస్ అపర్ణ, ఇ ప్రమీల, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.