ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా లాప్రోస్కోపిక్ సర్జరీలు
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి మండలంలోని బొంపల్లికి చెందిన 30 సంవత్సరాల ఒక మహిళ తీవ్రమైన కుడివైపు కడుపునొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా గాల్ బ్లాడర్ నెక్ లో స్టోన్ ఉందని వైద్యులు కనుక్కోన్నారు.
అదే విధంగా మంచిర్యాల కి చెందిన 40 సంవత్సరాల ఒక వ్యక్తి కుడివైపు కడుపునొప్పితో బాధపడుతూ నెల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా, గాల్ బ్లాడర్ నెక్ లో స్టోన్, ఇన్ఫెక్షన్ ఉందని కనుక్కోవడం జరిగిందని, ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం 3 వారాలు మందులు ఇవ్వడం జరిగిందని, ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత మంగళవారం ఇద్దరు పేషెంట్ లకు అధునాతన పద్ధతిలో లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించాం.
అదేవిధంగా పెద్దపల్లి కి చెందిన 33 సంవత్సరాల ఒక మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా గర్భాశయం రెండు భాగాలుగా ఉండడం గమనించామని, ఒక భాగంలో అటు వైపు గర్భాశయ నాళంలో ఎన్డోమెట్రియోసిస్ అనే వ్యాధి ఉందని గుర్తించి చెడిపోయిన భాగాన్ని తొలగించడం జరిగింది.
ఈ సర్జరీల లో పాల్గొన్న వైద్యుల బృందం లాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్ అమర సింహా రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ స్వాతి, డాక్టర్ రామమం, డాక్టర్ భవాని. ఈ మూడు సర్జరీలు చేసిన వైద్య బృందాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలందరూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న నవజాత శిశు కేంద్రం సేవలు, 2 డి ఎకో సేవలు, ఆధునిక పరిజ్ఞానంతో కూడిన లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు, యూరాలజీ సేవలు, రూట్ కెనాల్ సేవలను ఉపయోగించుకోవాలని, ఈ సేవలలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనచో నేరుగా సూపరింటెండెంట్ కలవచ్చని, సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు.
పేషెంట్ హాస్పిటల్ లో ఉన్న సమయం లో సానిటేషన్ గురించి గాని, వాష్ రూమ్ శుభ్రత గురించి గాని ఎవరైనా డబ్బులు అడిగినా, ఏ ఇతర సమస్య ఉన్నా కూడా నర్సింగ్ సూపరింటెండెంట్ ని, ఆర్ఎంఓ ను నేరుగా సూపరింటెండెంట్ ను సంప్రదించాలని, లేదా ఫిర్యాదులను కంప్లైంట్ బాక్స్ లో ఇవ్వవచ్చని, వారి సమస్యని వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో అన్ని రకముల సేవలు ఉచితమని, ఎవ్వరికి లంచం ఇవ్వరాదని శ్రీధర్ తెలిపారు.




