ఆర్మూర్ పట్టణంలో ఉద్రిక్తత
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాళ్లు
- బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
- కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు
- అంకాపూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడి గృహనిర్భందం
ఆర్మూర్, జూలై 20 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఇటీవల బీజే పీ నిర్వహించిన రణభేరిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారం లేపింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రం గా మండిపడ్డారు. ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
వారి హెచ్చరికకు ప్రతి స్పందించిన ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి తాను యుద్ధానికి సిద్ధం అంటూ అంకాపూర్ వేదికగా తనకు సమ ఉజ్జీ అయిన కాంగ్రెస్ నాయకుడు చర్చకు రావాలంటూ సవాస్‌ల్ విసిరారు. దీంతో ఆర్మూర్ పట్టణం, అంకాపూర్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి సమీపంలో ని ఇతర మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డిని వారి నివాసాల్లో గృహ నిర్భం దం చేశారు. ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి బయటికి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని, నిలువరించి తిరిగి ఇంట్లోకి పంపించా రు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరో పించారు.
ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి ఆర్మూర్‌ను రణరంగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నా రని ఆరోపించారు. వివిధ మార్గాల ద్వారా పలువురు కాంగ్రెస్ నాయకులు అంకాపూర్‌లో ఎమ్మెల్యే ఇంటి సమీపానికి చేరుకోవడం తో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.






