230 కోట్ల ధాన్యం స్వాహా!
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడేళ్లుగా ముఖం చాటేసిన మిల్లర్లు
- కాజేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యం
- అధికారుల దాటవేత ధోరణి.. వాయిదాలే తప్ప వసూళ్లు లేవు
- ఎగవేతదారులకు మరోసారి గడువు
- ఆగస్టు 5 వరకు అవకాశం
(బండి సంపత్‌కుమార్) :
మహబూబాబాద్, జూలై 21 (విజయక్రాం తి): కోట్లాది రూపాయల విలువ చేసే సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. గడువుల మీద గడువులు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన సుమా రు రూ.230 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం ఇప్పటికీ ప్రభుత్వం చేతికి చేరలేదు.
డిఫాల్ట్ మిల్లర్లకు మళ్లీ ఆగస్టు 5వరకు గడువు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను పలు రైస్ మిల్లులకు అప్పగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 300కు పైగా ఉన్న రా, బాయిల్ రైస్ మిల్లులు ఉండగా, వాటి సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించారు. అయితే కొందరు మిల్లర్లు నేటికీ బియ్యం అప్పగించలేదు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఆయా మిల్లుల్లో పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్ వడ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించిన అధికారులు రికవరీకి చర్యలు చేపట్టారు. ధాన్యానికి బదులు ధాన్యం ఇవ్వాలని, లేదా డబ్బులు చెల్లించాలని గడువు విధించారు. గడువు పూర్తి కావడంతో 25 శాతం జరిమానా కలిపి చెల్లించేందుకు మళ్లీ కొంత సమయం ఇచ్చారు.
క్రిమినల్ కేసులు నమోదు
అలాగే పలు మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని థర్డ్ పార్టీ ద్వారా విక్రయానికి పెట్టారు. అయితే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు మిల్లుల నుంచి ధాన్యాన్ని తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో వారు కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలో కొందరు మిల్లర్లు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కూడా పక్కదారి పట్టించారు. సీరియస్‌గా పరిగణించిన అధికారులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొందరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిలో కొంతమంది రాజకీయ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకోగా, మిగతా వారు ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు.
బకాయి సీఎంఆర్ ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 230 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు బకాయి పడ్డారు. హనుమకొండ జిల్లా పరిధిలో రూ.23 కోట్లు, వరంగల్ రూ.68 కోట్లు, జనగామ రూ.8 కోట్లు, భూపాలపల్లి రూ.27 కోట్లు, ములుగు రూ.15 కోట్లు, మహబూబాబాద్ జిల్లాలో 20 మిల్లులు రూ.98 కోట్ల మేర సీఎంఆర్ బకాయి పడ్డారు. 2022-23 ధాన్యం తీసుకున్న వారితో పాటు ఆ తరువాత కూడా పలు మిల్లులకు సీఎంఆర్ ధాన్యం అప్పగించారు.
వారు కూడా బియ్యం ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, జిల్లా అధికారులు డిఫాల్ట్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 5 వరకు బకాయిలను పూర్తిగా చెల్లించాలని, ఇదే తుది గడువని, ఆ తర్వాత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.
అయితే మళ్లీ గడువు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇచ్చిన గడువుకు మరో 23 రోజులే సమయం ఉంది. దిగమింగిన ధాన్యం డబ్బులను మిల్లర్లు ఈసారైనా చెల్లిస్తారా, లేదా? అన్నది ప్రశ్నార్థ్ధకంగా మారింది.






