10 May, 2026 | 2:37 AM

బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణే

10-05-2026 01:28 AM
  1. బీఆర్‌ఎస్ రాదు, కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారు
  2. మోదీసభను విజయవంతం చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ పిలుపు

సికింద్రాబాద్, మే 9 (విజయక్రాంతి): భారతదేశాన్ని అస్థిరపరచాలని చూసిన శక్తుల ను తొక్కిపడేసి అఖండ భారత్‌ను సురక్షితంగా ఉంచుతామని మాట ఇచ్చిన సాధించిన విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ రాదని, కాం గ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారని ఈటల విమర్శించారు. శనివారం సికింద్రాబాద్ గాయత్రి గార్డెన్‌లో విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి మన రాష్ట్రానికీ వస్తున్నారని అన్నారు.

బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణనే అన్నారు. బీఆర్‌ఎస్‌ను వద్దనుకొని కాంగ్రెస్‌కు ఓటువేస్తే తెలంగాణను అప్పుల ఊబిలో దించారని, నియంతృత్వ పోకడలు అనుసరిస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరిలో మోదీ ప్రచారానికి వచ్చినప్పుడు ఎంపీగా తనకు 25వేల మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రేపటి మోదీ సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశంలో 22 రాష్ట్రా ల్లో బీజేపీ గెలిచిందని, 23వ రాష్ట్రం తెలంగాణ గెలవబోతుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధించబోతున్నామన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి మోదీ సభకు లక్ష మంది హాజరుకానున్నారని చెప్పారు. వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తూ ఎండకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పా రు. బీజేపీ సంస్కారవంతమైన పార్టీ అని, తిట్టడం తమ సంస్కృతి కాదని ఈటల చెప్పా రు. నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా, వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.