2 June, 2026 | 8:04 PM

వాడవాడలా తెలంగాణ అవతరణ వేడుకలు

02-06-2026 05:39 PM

- వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ 

- రాజకీయాలకతీతంగా వేడుకలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల బెల్లంపల్లి పట్టణం లో తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీలకి అతీతంగా వాడవాడలా నిర్వహించారు. బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేష్, మునిసిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ దావ స్వాతి, ఎమ్మెల్యే క్యాంపు, కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ జాతీయ జండాను ఆవిష్కరించారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అవతరణ వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే వినోద్ మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఎన్నో ఏళ్ల ఉద్యమాలు, త్యాగాలు, ఆకాంక్షలు, అమరవీరుల బలిదానాల ఫలితమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, అమరవీరుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. 

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాకా వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ సాధనకు ఆయన చేసిన కృషి అపారమనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంలో కాకా పాత్ర ఎంతో కీలకమైందని గుర్తుచేశారు.