8 July, 2026 | 2:01 AM

ఘనంగా తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ వేడుకలు

08-07-2026 01:07 AM

‘సురక్షితమైన ఆహారం -సురక్షితమైన దేశం’పై ప్రతిజ్ఞ, ప్యానెల్ చర్చ

హైదరాబాద్, జూలై 7(విజయక్రాంతి): ఆహార భద్రతను బాధ్యతగా చాటి చెప్పే లక్ష్యంతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ క్యులినరీ అసోసియేషన్స్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ సొసైటీస్ అనుబంధ సంస్థ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఏడో వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో నిర్వహించారు.

ఈ వేడుకలను బ్యూరో డీ ఫ్రాన్స్ హెడ్ పాస్కల్ లోరియో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఇక్కడి స్థానిక ఆహార సంస్కృతి గురించి బాగా తెలుసు. హైదరాబాద్‌లోని అన్ని విషయాలను అన్వేషించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన పర్యటన అన్నారు. అలయన్స్ ఫ్రాంకైజ్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ హ్యూగో కావెట్ మాట్లాడుతూ నేను ఈ నగరానికి వచ్చి రెండేళ్లు కావస్తోందని, చెఫ్‌లు, విద్యార్థులు చూపిస్తున్న అంకితభావాన్ని ప్రత్యక్షంగా చూశానన్నారు. గతంలో రీజెన్సీ కాలేజ్, తాజ్ గ్రూప్, తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం లభించిందన్నారు.

తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెఫ్ అమే మరాఠే మాట్లాడుతూ చెఫ్‌లు కేవలం ఆహారాన్ని వండుతారని ప్రజలు అంటుంటారని, కానీ చెఫ్‌లు కుటుంబాలను కాపాడతారని, పిల్లల ఆరోగ్యాన్ని రక్షిస్తారని పేర్కొన్నారు. భారతీయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయని తెలిపారు. భారతదేశం గ్లోబల్ క్యులినరీ గమ్యస్థానంగా ఎదుగుతుందన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, అది ఒక జాతీయ బాధ్యత అని తెలిపారు. ఈ రోజు ‘సేవ్ ఫుడ్, సేవ్ నేషన్’ అనే మిషన్‌కు ఐదేళ్లపాటు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. 

‘సురక్షితమైన ఆహారం. దేశం’ అనే థీమ్ ద్వారా చెఫ్‌లు, విద్యావేత్తలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, హాస్పిటాలిటీ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములన ఒకతాటిపైకి తెచ్చి.. నైపుణ్యం, స్థిరత్వం, బాధ్యతాయుతమైన సంస్కృతికి నిర్మించాలని తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఆకాంక్షిస్తోందన్నారు. తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చెఫ్ ధర్మేందర్ లాంబా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ క్యులినరీ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీ చెఫ్ విజయభాస్కరన్, టీసీఏ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రమేష్‌రెడ్డి, హైదరాబాద్ తాజ్‌డెక్కన్ జనరల్ మేనేజర్ అర్నాబ్ గుప్తా తదితరులు హాజరయ్యారు.