ఆయోధ్య చోరీపై సీబీఐ విచారణ జరిపించాలి
- మోదీ, అమిత్‌షా నోరెందుకు మెదపడం లేదు
- ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : ఆయోధ్యలోని రాముడి గుడిలో దొంగలు పడితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ఎందుకు నోరుమెదపడం లేదని రాష్ట్రప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ప్రశ్నించారు. రాముని ట్రస్ట్ పేరుతో రూ. కోట్ల కాజేశారని ఆయన విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయోధ్యలో ఇంతపెద్ద స్కామ్ జరుగుతుంటే మోదీ విదేశాల్లో అవార్డు తీసుకుంటున్నారని వీహెచ్ మండిపడ్డారు. బీజేపీకి హిందూ దేశం కావాలనే ఆలోచన మాత్రమే ఉందని, రాముని గుడిలో ఇంత అన్యాయం జరిగితే బీజేపీ నేతలు మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ విచారణకు అదేశించిన కేంద్ర ప్రభుత్వం, ఆయోధ్యలో రూ. వేల కోట్ల అవినీతి జరిగితే ఎందుకు స్పందించడం లేదన్నారు. భద్రాచలంలోని ఈ అంశంపై చర్చకు పెడుతానని తెలిపారు. మోదీకి విదేశాలకు పోవడానికి టైమ్ ఉందని, అదే రాముని గుడికి పోవడానికి సమయం లేదా..? అని వీహెచ్ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ కలిసి రాముని పేరుతో ఎంత దోచుకుందో బయటికి రావాలని, అందుకు సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.






