8 March, 2026 | 4:28 PM

6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది

08-03-2026 02:12 PM

- డిండి ప్రాజెక్ట్ మార్పులతో మునుగోడు రైతులకు అన్యాయం

- రెగ్యులేటర్ లెవెల్ పెంపుతో నీటి ప్రవాహం తగ్గే ప్రమాదం

- ప్రభుత్వం వెంటనే సమీక్ష చేయాలి

-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ఇటీవల చేసిన సాంకేతిక మార్పులు మునుగోడు నియోజకవర్గ రైతులకు తీవ్ర అన్యాయం చేసే అవకాశముందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్ట్ ప్రారంభ ప్రణాళిక ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాకు 1.5 టీఎంసీలు, నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి 0.5 టీఎంసీ నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారని తెలిపారు. 

ఈ నీరు మునుగోడు ప్రాంతంలోని రైతులకు అత్యంత కీలకమైన సాగునీటి వనరుగా ఉండాల్సిందని పేర్కొన్నారు. అయితే శివన్నగూడెం వద్ద ఉన్న కాలువలో ముందుగా 436 మీటర్ల లెవెల్ వద్ద ఏర్పాటు చేసిన రెగ్యులేటర్‌ను ప్రస్తుతం 440 మీటర్ల లెవెల్‌కు మార్చినట్లు సమాచారం ఉందన్నారు. ఈ మార్పు కారణంగా ముందుగా రోజుకు సుమారు 6000 క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉండగా, ఇప్పుడు అది కేవలం 1200 క్యూసెక్కుల వరకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల మునుగోడు నియోజకవర్గంలోని సుమారు రెండు లక్షల ఎకరాల సాగుభూమికి సరైన నీరు అందకపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న మునుగోడు ప్రాంత ప్రజలకు ఇది మరో పెద్ద సమస్యగా మారుతుందని తెలిపారు.ఈ అంశంపై సాంకేతికంగా సమీక్ష చేసి, ముందుగా ఉన్న విధంగానే నీటి ప్రవాహం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు రైతుల హక్కైన సాగునీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజల హక్కుల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.