13 May, 2026 | 2:11 AM

టార్గెట్ ‘కీ’ పోస్ట్!

13-05-2026 01:14 AM

అబ్కారీ శాఖలో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులకు గిరాకీ

మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు 

సీనియార్టీని పక్కన పెట్టి బదిలీలు, పదోన్నతులు

ఎస్‌ఐ, సీఐల బదిలీలపై స్పష్టత కరువు 

ఆదాయం వచ్చే పీఎస్‌ల కోసం పోటీ

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): అబ్కారీ శాఖలో ఫోకల్, నాన్ ఫోకల్  పంచాయితీ నడుస్తోంది. సీనియార్టీని పక్కన పెట్టి రాజకీయ పలుకుబడి, వ్యక్తిగత సిఫారసుల ఆధారంగా బదిలీలు, పదోన్నతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులైన అధికారులను పక్కనపెట్టి, కొందరికి కీలక స్థానాలు కేటాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత మూడు నెలల క్రితం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లను భారీగా బదిలీలు చేసింది.

ఆ తర్వాత ఎస్‌ఐలు, సీఐల  బదిలీలు కూడా భారీగా ఉంటాయని అబ్కారీ శాఖ అధికారవర్గాలు తెలిపాయి. కానీ, ఎస్‌ఐ, సీఐల బదిలీల ఫైల్‌కు మోక్షం లభించడం లేదు. ఎస్‌ఐ, సీఐల బదిలీల ఫైలు సంబందిత శాఖ నుంచి ప్రభుత్వానికి వెళ్లినా.. అక్కడి నుంచి ఆమోదం లభించడం లేద ని సమాచారం. రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు ఎస్‌ఐలు, సీఐలు ఫోకల్ ఫోస్ట్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేల నుం చి సిఫార్సు లేఖలు తెచ్చుకోవడంతో బదిలీల కథ అడ్డం తిరిగింది.

అంతేకాకుండా పదోన్నతులు కల్పించిన 99 మంది అధికారులకు కూడా పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. కొంత మంది అధికారులకు వరసగా కీలక స్థానాలు దక్కుతుండగా, మరి కొందరు ఏళ్లతరబడి దూర ప్రాంతాల్లోనే (నాన్ ఫోకల్ పోస్టుల్లో) కొనసాగుతున్నారు. దీంతో ఈ శాఖలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, కౌన్సిలింగ్ విధానం పాటించకుండానే గోప్యంగా పోస్టింగ్స్ ఖరారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

అధికార పార్టీకి దగ్గరగా ఉన్న వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పోస్టింగ్‌ల  విషయంలో భారీగా ముడుపులు  చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా ముడుపులు  ఇచ్చిన వారికే ఫోకల్ పోస్టింగ్‌లు వస్తాయని లేదంటే నాన్ ఫోకల్ పోస్టులకే పరిమితం చేస్తారని ఆ  శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా ఫోకల్ పోస్టుల్లో పనిచేసే వారే మళ్లీ ఫోకల్ పోస్టింగ్ కోసం తాపత్రయ పడుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

అందుకే బదిలీల ప్రక్రియ ఆలస్యమవుతుందని చెపుతున్నారు. 2024లో వచ్చిన పార్ల మెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 మందిని చేసిన బదిలీలు తప్ప ఇప్పటివరకు ఈ శాఖలో పూర్తిస్థాయి బదిలీలు, పదోన్నతులు జరగకపోవడం విశేషం. అంతే కాకుండా ప్రస్తుతం పలు పోలీస్‌స్టేషన్ల  పరిధిలో పనిచేసే ఎక్సైజ్ ఎస్‌ఐలు, సీఐలు  బార్లు, వైన్‌షాపులు, పబ్‌ల యజమానులను బెదిరించి మాముళ్లు పసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు  ఉన్నాయి. కొందరు ఎస్‌ఐలు, సీఐలపై  అవినీతిపై శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. అయినా ఎస్‌ఐలు మాముళ్ల మత్తును వీడడం లేదని సంబంధిత శాఖ వర్గాలే చెపుతున్నాయి. 

పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్‌లు మరిచారు

ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులకు పదోన్నతులు కల్పించి మూడు నెలలైనా పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. 53 మంది అధికారులు ఎక్సైజ్ సూపరెండెంట్ నుంచి  ఆడిషనల్ కమిషనర్‌గా, 16 మందికి అడిషన్‌ల ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో మరో 30 మంది అధికారులను కలిపి మొత్తంగా మొత్తంగా 99 మందికి పదోన్నతులు కల్పించారు. ఇప్పటివరకు ఇద్దరు అడిషనల్ కమిషనర్లు, ఇద్దరు జాయింట్ కమిషనర్లకు మాత్రమే పోస్టింగ్ కల్పించారు. మిగతా 93 మంది అధికారులు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

రంగారెడ్డి డీసీ కోసం సీఎంఓ నుంచి పైరవీ 

రంగారెడ్డి జిల్లా డీసీ పోస్టు కోసం ఒక అధికారి ప్రస్తుతం సీఎంఓ నుంచి పైరవీ చేయించుకున్నట్టుగా తెలిసింది. ఆయనకే  రంగారెడ్డి డిసి పోస్టు ఫైసల్ అయ్యిందని త్వరలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా, అదాయం వచ్చే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు, డీసీ పోస్టుల కోసం భారీగా ఫైరవీలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం డిసీ పోస్టు లతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులైన శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, సంగా రెడ్డి, ఖమ్మం, వరంగల్ తదితర పోస్టుల కోసం పలువురు అధికారులు తీవ్రంగా పోటీపడుతున్నట్టుగా తెలిసింది.

వీటితో పాటు శేరిలింగంపల్లి, కొండాపూర్, శంషాబాద్, బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లతో పాటు పలు పిఎస్ లలో పోస్టింగ్ కోసం పలువురు సిఐలు ఇప్పటికీ తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం చెక్‌పోస్టులు, నాన్‌ఫోకల్‌లో పనిచేస్తున్న వారికి పోస్టింగ్‌ల్లో న్యాయం జరిగేలా ఆ శాఖ ఉన్నతాధికారులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఫోకల్ పోస్టింగ్ కోసం రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తుండటంతో సమీకరణాలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.