ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
చంద్రు తండ వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు
సహాయక చర్యల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
తిరుమలాయపాలెం, మే 12 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని చంద్రు తండ సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి రెండు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించి లారీలు పూర్తిగా దగ్ధమవడంతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి.
ప్రమాద సమయంలో లారీలలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు సజీవ దహనం కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఎస్త్స్ర కూచిపూడి జగదీష్ దర్యాప్తు ప్రారంభించారు.






