13 May, 2026 | 2:23 AM

అలసత్వం వద్దు

13-05-2026 01:24 AM

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది కలగొద్దు

ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించాలి

మక్క కొనుగోళ్లూ సాఫీగా జరగాలి 

నిర్లక్ష్యాన్ని సహించబోం 

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్, మే 12(విజయక్రాంతి): మిషన్ మోడ్‌లో పనిచేసి ధాన్యం సేకరణ, మక్కజొన్న కొనుగోళ్లు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థా యికి వెళ్లి కొనుగోళ్లను పరిశీలించాలని, అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎస్ రామకృష్ణారావు, సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మక్కజొన్న కొనుగోళ్లపై సమీక్షించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని స్పష్టం చేశారు. కాంటా వేసిన వడ్లను తరలించేందుకు ఒప్పం దం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని, అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దన్నారు. లారీల కొరతను అధిగమించేందుకు సమీప ప్రాంతాల్లోని ట్రాక్టర్లు, ఇతర వాహనాలను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు.

ధాన్యం లోడింగ్‌లో జాప్యం జరగకుండా హమాలీలతో పని చేయించుకోవాలని, రైతులకు వెంటనే రశీదులు అందేలా చూడాలన్నారు. ప్రతీ అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు.

వివిధ ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోందని, అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని, రైతుబజార్లు, ఫంక్షన్‌హాళ్లకు తరలించాలని కలెక్టర్లకు సూచించారు. వెసులుబాటును బట్టి అక్కడినుంచి గోదాములకు తరలించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని వివరించారు.    

అప్రమత్తంగా ఉండాలి..

మక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పోలీసుల సహాయం తీసుకుని సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. ధాన్యం సేకరణ, మక్క జొన్న కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్‌కు నివేదిక పంపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

ప్రత్యేక వ్యవస్థ..

అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, మండల స్థాయిలో ఒక అధికారిని, ప్రతీ ఐకేసీ సెంటర్, రైస్ మిల్లుల దగ్గర ఒక్కో అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు,  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

ఏ పమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలి: మంత్రి ఉత్తమ్

ధాన్యం సేకరణ, మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఏ సమస్య ఉన్నా  ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని,  పరిష్కారానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.   

పక్క రాష్ట్రాల ధాన్యం రాకుండా చూడండి: మంత్రి తుమ్మల

సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంత మంది ధాన్యాన్ని తెలంగాణలోని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ధాన్యం తీసుకురాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ పూర్తయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.