20 June, 2026 | 1:54 AM

రాజకీయల్లో మహిళా వాటా 10 శాతమే!

20-06-2026 12:41 AM
  1. పోటీ చేసే ప్రతి 10 మందిలో ఒక్కరే మహిళ
  2. ఏడీఆర్ సంస్థ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 19: భారత దేశ జనాభాలో మహిళలు సగభాగం ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం వారి వాటా 10 శాతం దాటడం లేదు. లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి 10 మంది అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే మహిళ ఉంటున్నట్లు తేలింది. మహిళా రిజర్వేషను బిల్లు- 2023 అమలులో ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడైంది.

ఈ మేరకు సర్వే వివరాలను వెల్లడిస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ గురువారం నివేదిక విడుదల చేసింది. మహిళా బిల్లు చట్టంగా మారిన తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో పలు రాజకీయపార్టీలు మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారనే దానిపై ఈ సంస్థ సర్వే చేసింది. 2023 సెప్టెంబర్ నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో పోటీచేసిన మొత్తం 51,708మంది అభ్యర్థుల్లో కేవలం 5,095 మంది మాత్రమే మహిళలు పోటీ చేసినట్లు వెల్లడించింది.

అంటే 10 శాతం మహిళలే పోటీచేసే స్థాయిలోనే ఉన్నట్లు తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు మొత్తం 21 ఎన్నికల్లో 39,789 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో 89.7% మంది పురుషులు, 10.2% మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచిన 8,360 మంది అభ్యర్థుల్లో 90.4% మంది పురుషులు, 9.6% మంది మహిళలున్నట్లు పేర్కొంది.

అత్యధికంగా ఒడిశాలో 13.9%, ఢిల్లీలో 13.7%, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 13.6% మంది మహిళలు పోటీచేశారని చెప్పింది. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మహిళల సంఖ్య 9.7శాతానికే పరిమితమైనట్లు వెల్లడించింది. ఐపీయూ1 ర్యాంకింగ్ ప్రకారం.. మార్చి 1, 2025 నాటికి పార్లమెంటులో మహిళల ప్రాతినిథ్యం విషయంలో 185 దేశాలలో భారత్  151వ స్థానంలో ఉందని, ప్రస్తుత పార్లమెంటు సభ్యులలో కేవలం 14 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని ఏడీఏ సర్వే తెలిపింది.