వడ్లు కొనండి అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం అన్యాయం
మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ
జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్, మే 26 (విజయక్రాంతి): పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యేకి ముందు వడ్లు కొనమని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు వేయడం అన్యాయమని, కార్మికులకు ప్రజల పక్షాన మాట్లాడే ట్రేడ్ యూనియన్ హక్కులు ఉంటాయనే విషయం తెలియకుండా మూర్ఖంగా వ్యవహరించడం బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం ఆమె మాట్లాడుతూ..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి అడ్లురి లక్ష్మణ్, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుంటే ముందు వడ్లు కొనండని చెప్పినందుకు జగిత్యాల డిపోకు చెందిన బస్ డ్రైవర్ పై వేటు వేసి డ్యూటీకి రావద్దని రిమూవల్ లెటర్ ఇచ్చిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అయితే తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని తెలిపిన డ్రైవర్ అశోక్ కు ఆర్‌ఎం నుంచి రిమూవల్ లెటర్ ద్వారా డ్యూటీకి రావద్దని సూచించటం కార్మిక హక్కుల ఉల్లంఘన కాదా? వెంటనే అశోక్ పై చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మంత్రికి తెలియదా? ప్రజా సమస్యలపై మాట్లాడడం కనీస బాధ్యతగా భావించిన డ్రైవర్ అశోక్ ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.






