ఎలిమినేట్ అయ్యేదెవరో?
రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ ఢీ
- ఓడిన జట్టు ఇంటికే
- పరుగుల వరద ఖాయం
న్యూ ఛండీఘర్, మే 26: ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరా బాద్, రాజస్థాన్ రాయల్స్ న్యూ ఛండీఘర్ వేదికగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు తో ఆడుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడు తుంది. దీంతో ఈ నాకౌట్ మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయం. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
లీగ్ స్టేజ్‌లో ఆర్సీబీ, గుజరాత్ జట్లతో సమా నంగానే 9 విజయాలు సాధించిన హైదరా బాద్ అన్ని విభాగాల్లోనూ అదర గొడుతోంది. ఆరంభంలో బౌలింగ్ బలహీనత ఉన్నా తర్వాత దానిని అధిగమించి వరుస విజయా లు అందుకుంది. బ్యాటింగ్‌లో ఎప్పటిలానే సన్‌రైజర్స్ దుమ్మురేపుతోంది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ఆ తర్వాత ఇషాన్ కిష న్, క్లాసెన్, నితీశ్‌రెడ్డి ఇలా పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది.
ముఖ్యం గా క్లాసెన్ మరోసారి అద్భుతంగా రాణిస్తున్నా డు. ఈ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేసిన క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ లైనప్ లో ఏ ముగ్గురు చెలరేగినా రాజస్థాన్ బౌలర్లకు చుక్కలే. అటు బౌలింగ్ లో కమిన్స్ తో పాటు ఎహసాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే అదరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో శివాంగ్ కుమార్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు.
ఈ సీజన్ ఆరంభంలో సన్‌రైజర్స్ బౌలింగ్‌పై అంచనాలు లేవు. అయితే అవకా శాలను అందిపుచ్చుకున్న యువ బౌలర్లు అదరగొట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ బౌలిం గ్ పటిష్టంగా మారిపోయింది. మరోవైపు డూ ఆర్ డై మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లే ఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్ రాయ ల్స్‌ను తక్కువ అంచనా వేయలేం. యువ, సీనియర్ ఆటగాళ్లతో నిలకడగా రాణిస్తోంది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ , జైస్వాల్ మెరుపు ఆరంభాలనిస్తున్నారు.
ఈ సీజన్ లోనూ సూపర్ ఫామ్‌తో దూసుకుపో తున్న వైభవ్ 550కి పైగా పరుగులు చేశాడు. జురెల్ కూడా టాపార్డర్‌లో రాణిస్తుండడంతో రాజ స్థాన్ భారీస్కోర్లు సాధిస్తోంది. పరాగ్ మాత్రం విఫలమవుతుండగా.. ఫెరీరా, శనక చివర్లో హిట్టింగ్ చేస్తున్నారు. అటు బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్‌కు ప్రధాన బలం.
దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణి స్తున్నాడు. అతనితో పాటు బర్గర్, యశ్ రాజ్ పూనియా, బ్రిజేశ్ శర్మ కూడా ఆకట్టుకుం టున్నారు. గత రికార్డులను చూస్తే సన్ రైజర్స్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 23 సార్లు తలపడితే హైదరాబాద్14 మ్యాచ్‌లలోనూ, రాజస్థాన్ 9 సార్లు విజయం సాధించాయి. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూ ఛండీఘర్ బ్యాటింగ్‌కే అనుకూలం.
హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీశ్ రెడ్డి, కమిన్స్(కెప్టెన్), ప్రఫుల్ హింగే, శివాంగ్ కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్
రాజస్థాన్: జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, పరాగ్ (కెప్టెన్), ఫెరీరా, దూబే, శనక, ఆర్చర్, బర్గర్, యశ్ రాజ్ , బ్రిజేశ్ శర్మ






