27 May, 2026 | 2:24 AM

పాత విధానంలోనే ఫీజుల స్కీం అమలు చేయాలి

27-05-2026 01:05 AM

ప్రభుత్వంపై అఖిలపక్ష, బీసీ నేతలు తీవ్ర ఆగ్రహం

ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి): బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై ప్రభుత్వంపై అఖిలపక్ష, బీసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండి విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. పలువురు బీసీ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే రద్దు చేసి, పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంస్థ అభివృద్ధి సలహాదారు వీ హనుమంత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం బలహీన పరచకూడదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి సమస్య పరిష్కారంపై మాట్లాడతానని చెప్పారు.

రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారీ మాట్లాడుతూ బీసీల పట్ల ప్రభుత్వాలు ఎప్పటినుంచో వివక్ష చూపుతున్నాయని, భారీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు ఇవ్వలేకపోవడం విచారకరమని అన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ కో చైర్మన్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, వేముల రామకృష్ణ, కౌలే జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.