బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్
మేడిపల్లి,(విజయక్రాంతి): బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఉప్పల్ గాంధీనగర్ కు చెందిన బాకారం అరుణ్ మహేష్, (38) అనే వ్యక్తి పీర్జాదిగూడలో శ్రీబాలాజీ సిమెంట్ బ్రిక్స్ పేరుతో సిమెంట్ బ్రిక్స్ తయారీ షెడ్‌ను నిర్వహిస్తున్నాడు. సదరు వ్యక్తి తన సిమెంట్ బ్రిక్స్ తయారీ ప్లాంట్‌లో బాల కార్మికులను పనిలో నియమించినందుకు 2024 సంవత్సరంలో ఒక కేసు, జూలై–2026లో మరో కేసు నమోదు చేయబడిందని తెలిపారు.
అదేవిధంగా 2025 సంవత్సరంలో మరో కేసు నమోదు అయిందని పై కేసులన్నీ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ పై కేసులు నమోదైన తరువాత కూడా సదరు వ్యక్తి తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు చేసుకోకుండా తన సిమెంట్ బ్రిక్స్ తయారీ షెడ్‌లో బాల కార్మికులను నియమించి పనులు చేయిస్తున్నాడు. కావున సదరు వ్యక్తి కార్యకలాపాలు, కదలికలను నిరంతరం గమనిస్తూ, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టుటకు అతనిపై సస్పెక్ట్ షీట్ తెరవడం జరిగిందని మేడిపల్లి పోలీసులు తెలిపారు.






