వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలి
* రైతులు పొలాల్లో విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దు
* పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్
పాపన్నపేట: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు, మత్తడులు ఉప్పొంగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దీంతో ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఏడుపాయలకు వెళ్లే భక్తులు, వనదుర్గా (ఘనపురం) ప్రాజెక్ట్ వద్ద వరద ఎక్కువగా ఉన్నందున మంజీరా నదిలో స్నానాలు చేయవద్దని హెచ్చరించారు.
పూరి ఇళ్లలో ఉండేవారు, నాసిరకం గోడల వద్ద, చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దని సూచించారు. రైతులు పొలాలకు వెళ్లే సమయంలో విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దని హెచ్చరించారు. రోడ్లపై ప్రవహిస్తున్న వాగులు, వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






