భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
పోలీసు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు
ఉట్నూర్,(విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడిన ప్రాంతాలను సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు గురువారం సాయంత్రం ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలోని నర్సాపూర్ (జె), నాగపూర్ బ్రిడ్జి, అలాగే ఉట్నూర్ గ్రామం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కల్వర్ట్లు, వంతెనలపై ప్రవహిస్తున్న వరద నీటి పరిస్థితిని పరిశీలించి, ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర ప్రాంతాల వద్ద పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలను అనుమతించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వేగంగా సహాయక చర్యలు చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వరద ప్రవాహాలు, కల్వర్ట్లు, వాగులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రాజెక్టు అధికారి విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీ సందర్భంగా పోలీసు శాఖ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






