28 August, 2026 | 12:19 AM

గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు

27-08-2026 10:43 PM

భాజపా సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): జీవో నెం.97కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు వెళ్లాల్సి ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావుని కాంగ్రెస్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచడాన్ని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి చల్ల. శ్రీలతరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... పాలిటెక్నిక్ విద్యార్థులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తుంటే, వారికి మద్దతుగా వెళ్లాలనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను గృహ నిర్బంధం చేయడం, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా హరించే విధంగా గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు పాల్పడటం అత్యంత సిగ్గుచేటని ఆమె విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో అణచివేయాలని ప్రయత్నించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, విద్యాసంస్థలకు నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.