14 August, 2026 | 6:14 PM

ఉద్యోగ ఖాళీలను పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

14-08-2026 04:15 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు (టీవీయూవీ, జీవీఎస్) డిమాండ్ చేశాయి. శుక్రవారం బెల్లంపల్లిలోని బీసీ వసతి గృహం వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే అనేక ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో వయోపరిమితి, ఆర్థిక ఇబ్బందులు, పోటీ పరీక్షలకు నిరంతరం సిద్ధమవుతున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ఖాళీలను సమగ్రంగా సమీక్షించి, ఉద్యోగాల సంఖ్యను కనీసం 20,000కు పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గుర్తించి వాటి వివరాలను పారదర్శకంగా ప్రకటించడంతో పాటు, భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను కూడా దశలవారీగా భర్తీ చేసే విధంగా స్పష్టమైన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను ప్రభుత్వం నెరవేర్చాలనిన్నారు. నిరుద్యోగుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సామాజిక బాధ్యతతోచూడాలని హితవు  పలికారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడటం మానుకోవాలని, తక్షణమే లేనిపక్షంలో విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.