అనురాగ్, సిఎస్ఐఆర్ -స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ల అవగాహన ఒప్పందం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఉన్నత విద్య, పరిశోధనా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న అనురాగ్ యూనివర్సిటీ, చెన్నైలోని సిఎస్ఐఆర్-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ తో విద్యా, పరిశోధనా సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన అధునాతన నిర్మాణ పదార్థాలు, విపత్తుల నివారణ, నిర్మాణాల మరమ్మతులు, పునరుద్ధరణ, నిర్మాణాల పనితీరు మూల్యాంకనం, కంప్యూటేషనల్ టెక్నిక్స్ తదితర రంగాల్లో ఆధునిక పరిశోధనలు నిర్వహిస్తోంది.
ఈ అవగాహన ఒప్పందంపై సిఎస్ఐఆర్- ఎస్ఈఆర్సి డైరెక్టర్ డాక్టర్ ఎన్. ఆనందవల్లి, అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయకుమార్ సంతకాలు చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ తరపున డాక్టర్ బి. నరేందర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. రామంజనేయులు, ప్రొఫెసర్ అలాగే డైరెక్టర్, చీఫ్ సైంటిస్టులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఇరు సంస్థలు సంయుక్త పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు విద్యార్థుల మధ్య విద్యా–శాస్త్రీయ పరస్పర మార్పిడిని ప్రోత్సహించనున్నాయి.






