5 August, 2026 | 10:18 AM

భారీ ఫైబ్రాయిడ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స

05-08-2026 09:21 AM

నాలుగు నెలలుగా అధిక రుతుస్రావంతో బాధపడుతున్న మహిళకు అచ్చంపేట కేర్ ఆస్పత్రిలో చికిత్స

అచ్చంపేట : నాలుగు నెలలుగా తీవ్రమైన అధిక రుతుస్రావంతో బాధపడుతున్న మహిళకు అచ్చంపేటలోని కేర్ హాస్పిటల్‌లో వైద్యులు విజయవంతంగా గర్భాశయ శస్త్రచికిత్స నిర్వహించారు. నల్గొండ జిల్లా దిండి మండలం గోనకోల్ గ్రామానికి చెందిన సుమేత్ర (43) తీవ్ర రక్తస్రావం సమస్యతో ఆస్పత్రిని ఆశ్రయించగా, వైద్య పరీక్షల్లో ఆమె హిమోగ్లోబిన్ కేవలం 8.6 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో గర్భాశయంలో 6×7 సెం.మీ. పరిమాణంలో భారీ ఫైబ్రాయిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రోగి రక్తహీనతను దృష్టిలో ఉంచుకుని వెంటనే శస్త్రచికిత్స చేయకుండా, ముందుగా పేరెంటరల్ ఐరన్ ఇంజెక్షన్ల ద్వారా చికిత్స అందించారు.

రెండు నెలల చికిత్స అనంతరం హిమోగ్లోబిన్ స్థాయి 12.4 గ్రాములకు పెరగడంతో పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి మంగళవారం కంప్లీట్ అబ్డామినల్ హిస్టరెక్టమీ శస్త్రచికిత్స చేపట్టారు. శస్త్రచికిత్సలో గర్భాశయం సుమారు 14 వారాల గర్భ పరిమాణంలో ఉండటంతో పాటు పెద్ద ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమై, ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శస్త్రచికిత్సను అచ్చంపేట కేర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్, సీఈవో డా. అమ్రీన్ షరీఫ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, రక్తహీనత, ఫైబ్రాయిడ్లు వంటి సమస్యలను మహిళలు నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే క్లిష్టమైన శస్త్రచికిత్సలు, ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని సూచించారు.