5 August, 2026 | 10:34 AM

కట్టను తవ్వి అక్రమ రోడ్డు నిర్మాణం

05-08-2026 09:52 AM

క్షేత్రస్థాయి విచారణకు గ్రామస్తుల డిమాండ్

కోనరావుపేట, ఆగస్టు 05 (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో గతంలో ఉన్న కుంట కట్టను తవ్వి కొందరు తమ సొంత అవసరాల కోసం అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డు సభ్యుల అనుమతి లేకుండా, తహసీల్దార్ కార్యాలయానికి చెందిన భూమిలో తహసీల్దార్ అనుమతి లేకుండానే పనులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పైగా రోడ్డు నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానం ఇవ్వడం గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు.

ఈ విషయమై 1వ వార్డు సభ్యురాలు, తహసీల్దార్‌ను గ్రామంలోని కొందరు యువకులు వివరణ కోరగా, ఈ విషయం మాకు తెలియదని  మావద్దకు ఎవరు రాలేదు వారు సమాధానం ఇచ్చినట్లు యువకులు తెలిపారు.గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రతిరోజూ 300 మందికి పైగా విద్యార్థులు బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అక్కడ కేవలం 20 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మిస్తే విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోతాయని అలాంటి ప్రజా అవసరాన్ని విస్మరించి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కుంట కట్టను తవ్వి రోడ్డు నిర్మించడం సమంజసం కాదని స్థానికులు, యువకులు ప్రశ్నించారు.

అక్రమ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, గ్రామపంచాయతీ ఇచ్చిన తీర్మానాన్ని రద్దు చేయాలని గ్రామస్తులు, యువత డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే 20 మీటర్ల రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, అక్రమ రోడ్డు నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు, యువకులు డిమాండ్ చేస్తున్నారు.