విద్యార్థులు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం
ఘట్ కేసర్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : విద్యార్థులు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం అన్నారు. ఘట్ కేసర్ డివిజన్ ఘనపూర్ లోని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈసదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఆధునిక సాంకేతికతలు, పరిశోధన, నవీన ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు, పరిశోధకులు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అంతేకాకుండా అంతర్జాతీయ సదస్సులు విద్యా సంస్థల అభివృద్ధికి గ్లోబల్ స్థాయి పరిజ్ఞాన మార్పిడికి ముఖ్య వేదికలని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్, డైరెక్టర్ స్ట్రాటజీ కొమ్మూరి దివ్య, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కశ్యప్, ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీనివాస రెడ్డి, పాల్గొని సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ పి. సత్యనారాయణ ప్రసంగించారు.






