14 July, 2026 | 3:43 AM

మానుకోట సమగ్రాభివృద్ధికి కృషి

14-07-2026 12:21 AM

కేసముద్రంలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం 

4 కోట్లతో కాకతీయుల కాలంనాటి శివాలయం పునరుద్ధరణ 

రూ.233 కోట్లతో మానుకోట కు ఓ ఆర్ ఆర్

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి 

మహబూబాబాద్, జులై 13 (విజయక్రాంతి): మానుకోట ప్రాంత వాసిగా రాజకీయంగా తనకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పించిన కేసముద్రం, మానుకోట సమగ్ర అభివృద్ధికి ముందుండి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన అగ్నిమాపక కేంద్రాన్ని రాష్ట్ర అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తాను అర్పణపల్లిలో జన్మించినప్పటికీ తనకు రాజకీయంగా ఎదగడానికి మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎంతో దోహద పడిందన్నారు. ఢిల్లీ స్థాయికి ఎదగడానికి దోహదపడ్డ మహబూబాబాద్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి తన శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.

విద్యా, వైద్యం, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తానని ప్రకటించారు. మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకా శాలు కల్పించడానికి అటు కేంద్రం ద్వారా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని చెప్పా రు. 233 కోట్ల రూపాయలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కొత్తగా ఓ ఆర్ ఆర్ చేపట్టడానికి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. కేసముద్రం సమగ్ర అభివృద్ధి లో భాగంగా అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించడానికి అవసరమైన స్థలాన్ని కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.

మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన డిసిసిబి బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే కాట్రపల్లి గ్రామంలో నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించనున్న కాకతీయుల కాలం నాటి శివాలయం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ, ట్రాన్స్ పోర్ట్ కమిటీ సభ్యుడు రావుల మురళి తదితరులు పాల్గొన్నారు.