రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఎస్‌పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీఓ కృష్ణయ్య పాల్గొన్నారు. ప్రమాద ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, హెల్మెట్–సీట్‌బెల్ట్ తప్పనిసరి చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు, రహదారి మరమ్మతులు, పాఠశాల బస్సుల తనిఖీలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం:
అనంతరం జరిగిన జిల్లా మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గంజాయి, నాటు సారా, ఇతర నిషేధిత మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల 400 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్ విక్రయాలను నిషేధించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వహీదుద్దీన్, అశోక్, డీపీవో భిక్షపతి గౌడ్, డీఎంహెచ్‌వో సీతారామ్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.






