హైవేలపై ‘షీ సేఫ్' జోన్
- సిద్దిపేట సీపీ సరికొత్త ఆలోచన
- మహిళల భద్రతకు ప్రాధాన్యం
సిద్దిపేట క్రైం: హైవేలపై ప్రయాణించే మహిళలు, కుటుంబాల భద్రతే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఒక సరికొత్త, వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజీవ్ రహదారి మీదుగా ప్రయాణించే వారి కోసం ‘షీ సేఫ్' జోన్ అనే మహిళా భద్రతా ఇనిషియేటివ్ ను ఆమె ప్రారంభించారు. హైవేలపై ప్రయాణించే కుటుంబాలు, మహిళలు ఎటువంటి భయాందోళనలు లేకుండా, నమ్మకంతో ఆగగలిగే సురక్షిత ప్రాంతాలను గుర్తించడమే ఈ ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం.
సురక్షితమైన పార్కింగ్ సదుపాయం, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాష్‌రూమ్స్, సీసీటీవీ నిఘా, మెరుగైన లైటింగ్ వ్యవస్థ, నమ్మదగిన సిబ్బంది ఉన్న ప్రాంతాలను సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ తరపున అధికారికంగా ‘షీ సేఫ్' జోన్‌గా ప్రకటిస్తారు. అందులో భాగంగా శుక్రవారం సీపీ రష్మీ పెరుమాళ్ రాజీవ్ రహదారిపై ఉన్న పలు లొకేషన్లను సందర్శించారు.
అక్కడ ఉన్న వసతులను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి యాజమాన్యాలకు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. రాబోయే నెల రోజుల్లో ఆయా లొకేషన్లలో అన్ని భద్రతా ప్రమాణాలు పూర్తి చేయించి, వాటిని పూర్తిస్థాయి 'షీ సేఫ్ జోన్'లుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.






