తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నకిలీ డిఏపి ముఠా అరెస్టు
- తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి నకిలీ డిఏపి దందా ముఠా గుట్టు రట్టు
- ఒక డీసీఎం వాహనం ఒక మారుతి ఎర్టిగా కారు,ఐదు సెల్ ఫోన్లు వివిధ కంపెనీలకు చెందిన లేబుల్ కలిగిన నకిలీ డిఏపి బస్తాలు
- నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్,నకిలీపాస్పేట్ సీజ్
- రెండు కోట్ల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
- రైతులు రాష్ట్ర వ్యవసాయ అధికారులు సూచించిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలి
- నకిలీ ఎరువులను కొనుగోలు చేసి ఆర్థికంగా శారీరకంగా నష్టపోవద్దని రైతులకు పోలీసులు సూచన
- కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి,హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు
హుజూర్ నగర్: రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులకు అడుగు మందు కొరత ఉన్నది అని భావించి అక్రమ మార్గాలలో కోట్లు గడించాలని ఆలోచనతో తీగలాగితే డొంక కదిలినట్లుగా...నకిలీ డిఏపి అడుగు మందు తయారు చేసి అమాయకులైన పలు రైతులను మోసం చేస్తూ అమ్ముతున్న ముఠాను గుట్టు రట్టు చేసి అరెస్టు చేసిన హుజూర్ నగర్ సర్కిల్ పోలీసులు...శుక్రవారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రంలో అడుగు మందు డిఏపి కొరత ఉన్న విషయాన్ని అదునుగా చేసుకొని రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో కొంత మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ నకిలీ దందాకు తెరలేపారు.
ఈనెల 15న మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్ కు అందిన సమాచారం మేరకు మఠంపల్లి పోలీసులతో కలిసి మండలంలోని రఘునాధ పాలెం గ్రామంలో పలు తనిఖీలు నిర్వహించగా కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి వద్ద నకిలీ డిఏపి కట్టలను స్వాధీనపరుచు కున్నారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి హుజూర్ నగర్ సిఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్సై ప్రవీణ్,మేళ్లచెరువు ఎస్ఐ నవీన్, ఏఎస్ఐ బలరాం రెడ్డి, శంభయ్య,నాగరాజు ఆధ్వర్యంలో విచారణను వేగవంతం చేయగా పోలీసుల దర్యాప్తులో పోయే నిజాలు వెలుగు చూశాయి.
మఠంపల్లి మండల పరిధిలోని రఘునాధ పాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి నకిలీ డిఏపి దందాకు తెరలేపినట్లు విచారణలో వెల్లడై యింది. హైదరాబాద్ నగరంలో పెద్ద అంబర్పేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ లో గోడౌన్ ను ఏర్పాటు చేసుకొని అక్కడ కోట్ల రూపాయల చేసే నకిలీ డిఏపి అడుగు మందు బస్తాలను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. నకిలీ డిఎపి ముఠాకు సంబంధించి ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురి నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
వీరితోపాటు ఒక డీసీఎం వాహనం ఒక మారుతి ఎర్టిగా కారు, ఐదు సెల్ ఫోన్లు వివిధ కంపెనీలకు చెందిన లేబుల్ కలిగిన నకిలీ డిఏపి బస్తాలు మరియు నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్, నకిలీపాస్పేట్ మరియు దాదాపు రెండు కోట్ల విలువైన సామాగ్రిని స్వాదినపరుచుకున్నారు.పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి,సిఐ చరమంద రాజు మాట్లాడుతూ... రైతులు రాష్ట్ర వ్యవసాయ అధికారులు సూచించిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని నకిలీ ఎరువులను కొనుగోలు చేసి ఆర్థికంగా శారీరకంగా నష్టపోవద్దని రైతులకు సూచించారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో నకిలీ ఎరువులకు సంబంధించి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు.రైతులను మోసం చేస్తూ నకిలీ ఎరువులు తయారుచేసి కోట్ల రూపాయలు గడుస్తున్న అక్రమ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ప్రవీణ్ కుమార్,నవీన్ కుమార్ హనుమాన్,సిబ్బంది గోలి శంభయ్య,తదితరులు పాల్గొన్నారు.






